**పెద్దపల్లి, జూన్-03**
------------------------------------------
**గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రభుత్వ సందేశం ప్రతి ఇంటికి చేరాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష**
*జూన్ 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామసభలు, వార్డు సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలి*
*ఎస్‌ఐఆర్ కార్యక్రమం, సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై సమగ్ర అవగాహన కల్పించాలి*
*వడదెబ్బ మరణాల ఎక్స్‌గ్రేషియా, ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకాలపై ప్రజలకు విస్తృత ప్రచారం నిర్వహించాలి*
*ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
------------------------------------------
జిల్లాలో నిర్వహించనున్న గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సందేశం ప్రతి ఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు.
బుధవారం ఎన్‌టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో *అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ )అరుణశ్రీ* తో కలిసి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, వ్యవసాయ, పోలీసు, వైద్య, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* గ్రామపంచాయతీలు, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తుందని తెలిపారు. అయితే ఎక్స్‌గ్రేషియా మంజూరుకు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదిక, మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్)ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. కుటుంబంలో మరణం సంభవించిన అర్హులైన కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎంపీడీవో లేదా తహసీల్దార్ స్థాయిలోనే మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామసభలు, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం, సూపర్ ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి నిర్వహణ, విద్యుత్ రంగ అవసరాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఓటు రక్షణ, కార్యక్రమ షెడ్యూల్, సమర్పించాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను గ్రామసభల్లో పూర్తిస్థాయిలో వివరించాలని, ప్రజల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై అవగాహన కల్పించాలని సూచించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 నాటికి సాధారణ వర్షాలు నమోదు కాకపోతే ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై దశలవారీ కార్యాచరణ ప్రణాళికలను రైతులకు వివరించాలని తెలిపారు.
గ్రామసభలు కేవలం ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించే కార్యక్రమాలుగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సభల నిర్వహణ స్థలం, సమయం, ఉద్దేశ్యాన్ని ముందుగానే ప్రజలకు చేరవేసి భారీ స్థాయిలో ప్రజలను సమీకరించాలని సూచించారు.తక్కువ వర్షపాతం ఉన్నా ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున గ్రామాల్లో బ్యాకప్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, కాలువల పూడికతీత, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు.
ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామసభల్లో పాల్గొని వడదెబ్బ నివారణ, వర్షాకాల వ్యాధుల నివారణ, తాగునీటి భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలోని చెరువుల కట్టల బలాన్ని పరిశీలించి, మరమ్మతులు అవసరమైన ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఏసీపి గోదావరిఖని రమేష్, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.