నిజాయితీలో మా పిల్లలు ``బంగారం ``
నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.
తిరుపతి జిల్లా, వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ గర్ల్స్ హైస్కూలులో చదువుతున్న మా పిల్లలు ``బంగారం`` అని నిరూపించుకున్నారు. గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టగా వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం నిరీక్షిస్తున్న కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి గురుప్రియ, బి గీతిక, ఎం గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ , 7వ తరగతి విద్యార్థిని హేమలతలకు ఒక పర్సు కనిపించింది. పర్సు తీసి చూడగా బంగారం, నగదు. ఇంకో ఆలోచన లేకుండా అమ్మాయిలంతా పోలీస్ స్టేషన్ వైపు నడిచారు. ఎస్ఐ స్వరూపకు తమకు దొరికిన పర్సు అందజేసి, అభినందనలు అందుకుని ఇంటికెళ్లేందుకు బస్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ ఓ మహిళ పర్సు కోసం వెతుకుతూ పిల్లల్ని అడిగింది. తమకే దొరికిందని, స్టేషన్‌లో ఇచ్చామని చెబుతూ ఆమెతో పాటు స్టేషన్‌కు వెళ్లారు పిల్లలు. నగలు, నగదు అమెవేనని నిర్ధారించుకున్న ఎస్ఐ ఆ మహిళకు అందజేశారు. చిన్నవయస్సులో మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ!. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులూ..