*పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐ.జి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐ.పీ.ఎస్., గారు.....*
మే 26, మంగళవారం నాడు గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐ.పి.ఎస్. గారు వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన ఐ.జి. గారికి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్. గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం, పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఐ.జి. గారు, కార్యాలయ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును ఐ.జి. గారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, సిబ్బంది హాజరు, మరియు పరిపాలనాపరమైన ఫైళ్ల కదలికల వంటి కీలక అంశాలను ఆయన లోతుగా సమీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో, గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తు పురోగతి, మరియు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి నివేదికలను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న వ్యూహాలు మరియు నేరాల నియంత్రణలో పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఐ.జి. గారు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.....,
ప్రజల భద్రతే పరమావధిగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల గుర్తింపు మరియు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని మరియు విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకతను పాటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, నర్సాపురం డీఎస్పీ శ్రీ ఎం. సుధాకరరావు గారు, తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ ఎం.వి.వి సత్యనారాయణ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
@APPOLICE100