ఇథనాల్ చిక్కు: పాతికేళ్ల రోడ్‌మ్యాప్‌లో రైతు ఉన్నాడు, పెట్టుబడిదారు ఉన్నాడు . ‘వినియోగదారుడు’ ఏడి?
జూన్ 10, 2026 న దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఒక చిన్న నోటిఫికేషన్ వెలువడింది. 22 నుంచి 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ‘శూన్యం’ చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. వార్తల్లో ఇదొక చిన్న లైనే కావచ్చు, కానీ దీని వెనుక పాతికేళ్ల సుదీర్ఘ కథ ఉంది! ఒక పరిశ్రమను నిలబెట్టడానికి పాలకులు మెట్టు మెట్టుగా వేసిన వ్యూహాత్మక భరోసాల కథ ఇది. చిత్రం ఏమిటంటే.. ఈ పాతికేళ్ల రోడ్‌మ్యాప్‌లో ప్రతి పాత్రకూ ఒక ‘హామీ’ దొరికింది. ఒకే ఒక్క పాత్రకు తప్ప! ఆ ఇంధనాన్ని కొని, తక్కువ మైలేజ్‌తో బండి నడపలేక అల్లాడిపోతున్న సగటు సామాన్య వినియోగదారుడికి ఈ కథలో ఎక్కడా చోటు దక్కలేదు.
అసలు పునాది ఎక్కడ?
ఇథనాల్ బ్లెండింగ్ విత్తనం పాతికేళ్ల క్రితం, 2001లో వాజ్‌పేయి హయాంలో పడింది. ఆటోమొబైల్ కంపెనీలు, చక్కెర పరిశ్రమతో సంప్రదించి, జనవరి 2003లో ‘ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్’ (EBP) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే, తొలి రోజునే ఈ పథకం వెనుక ఉన్న అసలు లక్ష్యాలను స్పష్టం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన చక్కెర మిల్లులకు ఊపిరి పోయడం, రైతులకు చెరకు బకాయిల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడడం. అంటే.. ఈ పథకం పుట్టుకతోనే ఉత్పత్తిదారు-రైతు కేంద్రితమైనది. ఇందులో ఎక్కడా వినియోగదారుడి ప్రయోజనం దాని ‘డిజైన్’ లోనే లేదు.
తర్వాత వచ్చిన యూపీఏ (UPA) హయాంలో లక్ష్యాలు పెరిగినా, పన్నుల నిర్మాణాన్ని, ధరల నియంత్రణను తేవడంలో విఫలమవడంతో ఒక దశాబ్దం పాటు ఈ రంగం స్తబ్దతగా ఉండిపోయింది. 2014 నాటికి దేశంలో సగటు బ్లెండింగ్ కేవలం 1.53 శాతానికే పరిమితమైంది.
కార్పొరేట్లకు ‘భరోసా యంత్రం’
2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారాక ఇథనాల్ కథ పూర్తిగా మలుపు తిరిగింది. పెట్టుబడిదారుల ముక్కు పట్టుకుని కూర్చున్న మూడు ప్రధాన భయాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా తుడిచేసింది.
మూలధన భయం: కొత్తగా డిస్టిలరీలు కట్టడానికి రుణాలపై ఏకంగా 6 శాతం వడ్డీ సబ్సిడీ ఇచ్చింది. పైగా ఇథనాల్ ప్రాజెక్టులను ‘ప్రాధాన్య రంగ రుణాలు’గా మార్చింది.
ధర భయం: మార్కెట్ ఒడిదుడుకుల రిస్క్ లేకుండా ఏటా ప్రభుత్వమే లాభదాయకమైన ధర నిర్ణయించేలా ‘అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం’ తెచ్చింది.
కొనుగోలుదారు భయం: ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో (OMCs) ‘హామీ కొనుగోలు, హామీ ధర’తో కూడిన ఫిక్స్‌డ్ కాంట్రాక్టులను ఇప్పించింది. దీనికి తోడు జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించింది.
ఈ ప్రభుత్వ భరోసా యంత్రం వల్ల 2014లో 38 కోట్ల లీటర్లుగా ఉన్న ఇథనాల్ సరఫరా, 2025 జూన్ నాటికి ఏకంగా 661 కోట్ల లీటర్లకు చేరింది. ఫలితంగా, అనుకున్న గడువు కంటే ఐదేళ్ల ముందే, అంటే 2025లోనే భారత్ 20 శాతం బ్లెండింగ్ (E20) లక్ష్యాన్ని ముద్దాడింది. పారిశ్రామిక విధానంగా ఇది నిస్సందేహంగా సూపర్ హిట్!
అతిగా తిని.. అరగక.. సామాన్యుడిపై భారం!
కానీ, ఈ కార్పొరేట్ విజయం వెనుక ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వం ఇచ్చిన ‘భరోసా’ వల్ల, పరిశ్రమలు దేశ అవసరానికి మించి డిస్టిలరీలను కట్టేసాయి. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 2,000 కోట్ల లీటర్లకు చేరింది. కానీ, ప్రస్తుత E20 లక్ష్యానికి దేశానికి కావాల్సిన గరిష్ట డిమాండ్ కేవలం 1,200 కోట్ల లీటర్లు మాత్రమే! అంటే.. అవసరానికి మించి 100 శాతం మిగులు సామర్థ్యం పేరుకుపోయింది.
ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. కట్టేసిన ప్లాంట్ల సామర్థ్యానికి సరిపడా ‘డిమాండ్ సృష్టించడం’ సవాలుగా మారింది. మే 15న BIS ద్వారా E22 నుంచి E30 వరకు కొత్త బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేయడం, తాజాగా వాటిపై ఎక్సైజ్ సుంకం పూర్తిగా ఎత్తేయడం.. ఇవన్నీ పరిశ్రమల మిగులు భారాన్ని ఎక్కడో ఒకచోట పీల్చేయడానికి ప్రభుత్వం తెరుస్తున్న ‘విడుదల వాల్వ్’లు మాత్రమే!
రోడ్‌మ్యాప్‌లో లేని సామాన్యుడు
ఈ మొత్తం వ్యూహంలో వినియోగదారుడి పరిస్థితి దారుణంగా మారింది. ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ వాహనం మైలేజ్ దారుణంగా పడిపోతుంది. పాత వాహనాల్లో E10 నుంచి E20 పెట్రోల్‌కు మారినప్పుడే దాదాపు 12 శాతం వరకు మైలేజ్ తగ్గిందని ‘ఆటోకార్’ పరీక్షలు తేల్చాయి. రేపు E100 ఇంధనం వస్తే మైలేజ్ ఏకంగా 30 శాతం వరకు పడిపోతుంది.
దీనికి ప్రభుత్వం చెపుతున్న ఓదార్పు.. పంప్ వద్ద ధర తగ్గుతుందని! కానీ అది కేవలం ఒక ‘అంచనా’ మాత్రమే. బ్లెండింగ్ 20 శాతానికి చేరినా నేటికీ బంకుల్లో ధరలు తగ్గలేదు. అన్నిటికంటే పదునైన వైరుధ్యం ఏమిటంటే.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు కొనే సంపన్నులకు అది ‘ఛాయిస్’ అని చెప్తున్న ప్రభుత్వం, సాధారణ బైకులు నడిపే సామాన్యుడికి మాత్రం E20 పెట్రోల్‌ను ‘తప్పనిసరి’ చేసింది. ఈరోజు ఏ బంకుకు వెళ్లినా స్వచ్ఛమైన పెట్రోల్ (E0) దొరికే పరిస్థితి లేదు.
🚨 HUGE MOVE BY MODI GOVT
The Centre has COMPLETELY WAIVED central excise duty on ethanol-blended fuel containing over 20% ethanol 🔥
— If the benefit is passed on, E30 fuel could theoretically be about ₹11.90/litre CHEAPER than regular petrol 🤯