తాడేపల్లి
ఎస్‌ఐఆర్‌పై పూర్తి అప్రమత్తతతో పనిచేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అత్యంత కీలకమైన ప్రక్రియ అని, పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ పరిశీలకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాల విజయాన్ని సజ్జల ప్రస్తావించారు. ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, జూన్ 12న నిర్వహించిన భారీ ర్యాలీలు సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షించారని, పార్టీ నాయకత్వం మొత్తం కార్యక్రమాల్లో భాగస్వామ్యమైందన్నారు.
పార్టీ కమిటీల ఏర్పాటు, సమన్వయంతో కూడిన కృషి వల్లే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. రెండేళ్లలోనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి అసంతృప్తి, ఆగ్రహం ఉందో ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొనేందుకు ఇది మంచి సంకేతమని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం కానుందని, జులై 14 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని తెలిపారు. అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తయ్యాక సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారని వివరించారు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రతి దశ కీలకమని, పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముసాయిదా దశలోనే అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్ఏలకు పూర్తి అవగాహన కల్పించాలని, పార్టీ నాయకత్వం మొత్తం యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో రియల్‌టైమ్ క్లస్టర్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, బూత్ స్థాయి నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వార్‌రూమ్‌లలో సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, పార్టీ కేంద్ర కార్యాలయం స్థాయిలో మూడు స్థాయిల్లో వార్‌రూమ్‌లు పనిచేస్తాయని తెలిపారు.
రానున్న రెండు నెలలు పూర్తిగా ఫోకస్‌తో పనిచేయాలని, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిశీలకులు కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.