*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ఆరోగ్యశాఖ పనితీరు ప్రశంసనీయం*
*ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బందిని అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ*
*హెల్త్ అవేర్‌నెస్ వీక్ ద్వారా ప్రజారోగ్య రంగంలో కీలక సంస్కరణలు, సేవల విస్తరణ*
హైదరాబాద్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందన పొందాయని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఆరోగ్యశాఖ కీలక పాత్ర పోషించిందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు ఆరోగ్యశాఖ పనితీరును ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో వైద్య సేవల విస్తరణ, ఆధునికీకరణ, మానవ వనరుల బలోపేతం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన హెల్త్ అవేర్‌నెస్ వీక్ రాష్ట్రవ్యాప్తంగా విశేష విజయాన్ని సాధించిందన్నారు. వారంరోజుల పాటు 20కు పైగా ప్రధాన కార్యక్రమాలను నిర్వహించి ఆరోగ్యకర జీవనశైలి, వ్యాధుల నివారణ, మాతా-శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ సేఫ్టీ, హెచ్‌ఐవీ నియంత్రణ, క్యాన్సర్ అవగాహన వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించామని తెలిపారు.
హెల్త్ వీక్‌ను ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డేతో ప్రారంభించామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఈట్ రైట్ మేళా, మిల్లెట్ మేళా ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మిల్లెట్ల వినియోగం, ఆహార నాణ్యత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేసి సురక్షిత ఆహారాన్ని ప్రోత్సహించామని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య రంగంలో పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. నిమ్స్‌లో రూ.33 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక LINAC సేవలను ప్రారంభించి క్యాన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి క్యాన్సర్ కేసు నమోదయ్యేలా క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించి తెలంగాణ క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించామని తెలిపారు. మహిళల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాలను ప్రారంభించామని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు సమగ్ర ట్రామాకేర్ పాలసీని ప్రారంభించామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రామా కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తూ 109 ట్రామా కేర్ సెంటర్లు, 31 క్రిటికల్ కేర్ బ్లాక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కొండాపూర్‌లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌కు శంకుస్థాపన చేయగా, నాగర్‌కర్నూల్‌లో నూతన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించామని వెల్లడించారు.
ఆధునిక సాంకేతికతను ప్రజారోగ్యానికి ఉపయోగించుకునే దిశగా ఏఐ ఆధారిత లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
డిజిటల్ సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్‌ను ప్రారంభించామని, ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చామని పేర్కొన్నారు. పీసీపీఎన్‌డీటీ, ఏఆర్టీ, సరోగసి పోర్టల్స్‌ను ప్రారంభించి సంబంధిత సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేశామని తెలిపారు.
మాతా-శిశు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సేఫ్ మదర్‌హుడ్ డే కార్యక్రమాలను నిర్వహించామని మంత్రి తెలిపారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, హైరిస్క్ గర్భధారణల గుర్తింపు, నార్మల్ డెలివరీల ప్రోత్సాహంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో మిడ్‌వైఫరీ శిక్షణా కేంద్రాలను విస్తరించే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.