ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి:
కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచన
ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు.. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి ఫుల్ డిమాండ్
మద్దతు ధర (MSP) కంటే ఎక్కువ ధర పలికే అవకాశం
ప్రజాభవన్ లో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటి సమావేశం
సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా భవన్‌లో సోమవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీ డి. శ్రీధర్ బాబు, శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావులు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పై కేబినెట్ సబ్ కమిటి చాలా లోతుగా సమీక్ష చేసింది. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్ర్తవేత్తలు పాల్గొని పలు కీలక ప్రతిపాదనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు లాభాదాయకం, ఎగుమతులకు అనుకూలమైన BPT 5204, తెలంగాణ సోనా (RNR 15048), KNM-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, WGL 962, WGL 44, JGL 1798 ఈ 8 రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక 8 రకాల వంగడాలను సాగు చేయడం వల్ల రైతులకు మార్కెట్లో తిరుగులేని డిమాండ్ లభిస్తుందని అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివరించారు.
మార్కెట్లో ఈ బియ్యానికి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. ‘‘తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇవి అత్యంత అనుకూలమైనవి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉంది. దీనివల్ల ఇది రైతులకు అత్యంత లాభదాయకమైన పంటగా మారనుంది. ఈ మేలు రకం పంటలను సాగు చేయడానికి మార్కెట్లో విత్తనాల కొరత అస్సలు లేదని, కాబట్టి సాగును విస్తృతం చేయడం సులువని’’ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలన్నా, అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో వచ్చే ఒడిదొడుకుల (రిస్క్) నుండి రైతులకు పూర్తి రక్షణ లభించాలన్నా ఈ 8 రకాల వంగడాల సాగు ఒక్కటే మార్గం. ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరచడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు సైతం కేబినెట్ సబ్ కమిటీకి నివేదించారు.
రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని రకాల సన్న బియ్యానికి మార్కెట్లో ఆదరణ లభించడం లేదని సివిల్ సప్లై అధికారులు మంత్రులకు వివరించారు. కొన్ని రకాల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నప్పుడు బియ్యం ఎక్కువగా విరిగిపోతుండటం (బ్రోకెన్ రైస్), అలాగే వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా అవి లేకపోవడంతో మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదని, వినియోగదారులు, మిల్లర్లు మరియు వ్యాపారులకు ఇష్టమైన.. అలాగే అంతర్జాతీయంగా ఎగుమతులకు అనుకూలమైన నిర్దిష్ట వరి రకాలను మాత్రమే ఇకపై ప్రోత్సహించాలని, డిమాండ్ లేని రకాల సాగును క్రమంగా తగ్గించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఈ విధానం వల్ల మిల్లర్లే నేరుగా రైతుల వద్దకు వచ్చి మంచి ధరలకు వరిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, తద్వారా రైతులకు లాభం చేకూరడమే కాకుండా, ప్రజలకు కూడా ఇష్టమైన నాణ్యమైన బియ్యం అందుబాటు ధరల్లో లభిస్తాయని అధికారులు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని కేబినెట్ సబ్ కమిటికి అధికారులు నివేదించారు. భవిష్యత్తులో రైతులకు నష్టాలు రాకుండా ఉండేందుకు పూర్తిగా మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులు మంత్రులకు వివరించారు.
ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీ సురేందర్ మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపీ, మార్క్ఫెడ్ ఎం.డి రాహుల్ రాజ్, సివిల్ సప్లై కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.