ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే… దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం రాయచూర్ కు చెందిన శ్రీ ఎస్. రాజేంద్రారెడ్డి, క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ (హైదరాబాద్) వారు తమ స్వంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తి అయినందున దేవస్థానం వైదిక కమిటి సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారులు లిఖిత పూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరచి 28.02.2026 ఉదయం శాస్ట్రోక్తముగా స్థానిక శాసన సభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవిన్యూ, పోలీస్ వారి సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయమును తొలగించారు. 27.06.2026 న ఉత్తరాయణ పుణ్య కాలంలో నూతన దేవాలయ పునః ప్రతిష్ట చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారు కూడా. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం, సున్నితమైన మతపరమైన అంశాలలో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరం.
#FactCheck
#AndhraPradesh