జుజ్జూరులో పి.యం సూర్యఘర్ పథకం ప్రారంభం – SC/ST కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్..
2 కిలోవాట్ రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలతో ఉచిత విద్యుత్, అదనంగా రూఫ్ రెంట్ – ప్రజలకు, ప్రభుత్వానికి ద్వంద్వ లాభం..
జుజ్జూరు గ్రామంలో పి.యం సూర్యఘర్ U.L.A మోడ్ కింద SC/ST వినియోగదారులకు సూర్యఫలకాల గ్రిడ్ అనుసంధాన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SC/ST కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల లోపు వినియోగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2 కిలోవాట్ రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను రాష్ట్రవ్యాప్తంగా 1.91 లక్షల కుటుంబాలకు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
APCPDCL పరిధిలో ఈ పథకం ద్వారా మొత్తం 382 మెగావాట్ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుందని, దీని ద్వారా సుమారు 4.53 లక్షల కుటుంబాల అవసరాలు తీర్చగలమన్నారు. ఈ సోలార్ వ్యవస్థలు 25 సంవత్సరాల పాటు గ్రీన్ ఎనర్జీ అందించడంతో పాటు ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ MNRE ద్వారా కొంత ఆర్థిక సహాయం (CFA) అందించబడుతుండగా, మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది. దీని వల్ల ఫ్రీ పవర్ పథకంపై ఉన్న సబ్సిడీ భారం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మొత్తం జీవితకాలంలో సుమారు ₹6,200 నుంచి ₹6,900 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలో మొదటి దశలో 2000 మంది SC/ST వినియోగదారులకు 2 కిలోవాట్ సోలార్ పలకలు ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నాయి.ఇందులో భాగంగా కరివేణి బక్క గ్రామంలో 175 మంది లబ్ధిదారులకు ఈ సదుపాయం అందించనున్నారు. ఇంకా, వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు సుమారు ₹150 నుండి ₹200 వరకు రూఫ్ రెంట్ పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ బిల్లులు తగ్గడం ద్వారా దీర్ఘకాలంలో భారీ ఆదా కలుగుతుందని పేర్కొన్నారు. అదనంగా, RDSS పథకం కింద కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, వ్యవసాయ లైన్లను గృహ విద్యుత్ లైన్ల నుండి వేరు చేయడం ద్వారా రైతులకు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించబడుతుందని వివరించారు.
ఇక ఏప్రిల్ 1 నుంచి చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాల వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించబడుతుండగా,నాయీబ్రాహ్మణులకు కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు.ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు, ప్రభుత్వం, డిస్కమ్— మూడు వర్గాలకూ ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, డిసీ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, నీటి సంఘం అధ్యక్షులు, కూటమినేతలు, స్థానికులు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#Adminpost