ఉచిత కరెంట్.. కాంగ్రెస్ పేటెంట్,
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం... రైతులకు ఉచిత కరెంట్ కొనసాగుతుంది,
విద్యుత్ డిమాండ్ 3,500 మెగావాట్లు పెరిగినా.. రెప్పపాటు కూడా కట్ లేదు:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాకబండలో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... సాంకేతికంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి విద్యుత్ శాఖ అప్‌డేట్ అవుతోందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా, ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు.
2023లో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలోనే అది 18,548 మెగావాట్లకు చేరుకుందన్నారు. కేవలం రెండున్నర సంవత్సరాలలో 3,500 మెగావాట్లకు పైగా డిమాండ్ పెరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియలైజేషన్, ఫార్మా సిటీ, డేటా సెంటర్లు, ఐటీ హబ్‌లు వంటి ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని, దానికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
2030 నాటికి 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా 85 గ్రామాలను సంపూర్ణ సౌర గ్రామాలుగా మార్చే చర్యలు చేపట్టామన్నారు. రెండు మండలాల్లో వ్యవసాయ పంప్‌సెట్లకు 100% సోలరైజేషన్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
గిరిజనులకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం కింద 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ వ్యవస్థ కల్పించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, దీనికోసం ప్రభుత్వం నెలకు ₹1,150 కోట్లు (సంవత్సరానికి సుమారు ₹14,000 కోట్లు) విద్యుత్ శాఖకు చెల్లిస్తోందన్నారు. అలాగే 53 లక్షల నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
రైతులకు మీటర్లు పెడతామని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు, “మేము రైతులకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయము. ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్ హక్కు. మేము ఇలాగే ఉచితంగా ఇస్తాము” అని స్పష్టం చేశారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి విద్యుత్ రంగం కీలకమని, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, సౌర ఇంధనం, నాణ్యమైన విద్యుత్ సరఫరా విధానాలను అమలు చేస్తామన్నారు.
ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేసి, అవసరమైన చోట కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో వేలాడుతున్న వైర్లను 15 రోజులు లేదా నెల రోజుల్లో సరిచేయకపోతే కట్ చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
#BhattiVikramarka #PowerSector #TelanganaPower #33KVSubstation #Pakabanda #Khammam #ElectricityDevelopment #GreenEnergy #RenewableEnergy #24x7Power #PrajaPrabhutvam #ManaTelangana #TelanganaDevelopment #EnergySecurity #PowerInfrastructure #TGSPDCL #ContinuousPower #FutureEnergy #PublicWelfare #PeopleFirst #CongressGovernment #TelanganaProgress #ElectricityForAll #EnergyRevolution #khammamnews