Fake.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్.
అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను.
youtu.be/JEya0lszUPY
దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం.
నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు.
నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.
దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.”
ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు?
ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
“ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను.
మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.